ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి

Jan 31,2024 21:32 #ap special status, #speech

– ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎంపిలు లేవనెత్తాలి

– ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌:రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఎన్నికల ముందే ఉద్యమించి సాధించుకోవాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వివి లకీëనారాయణ అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలోని ఒక హోటల్‌లో బుధవారం విలేకరుల సమావేశం, అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చివరి పార్లమెంటు సమావేశాల్లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ఎంపిలు ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తి, బడ్జెట్‌ ఓటింగ్‌లో పాల్గనాలని సూచించారు. తమిళనాడు జల్లికట్టు ఉద్యమం తరహాలో చిత్తశుద్ధితో ఉద్యమిస్తే ప్రత్యేక హోదా సాధించడం కష్టమేం కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రంలోని టిడిపి, వైసిపి ప్రభుత్వాలు మోకరిల్లి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాయని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధుల ఊసే లేకుండా పోయిందని తెలిపారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో నోరు మెదపలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బిజెపిని రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపడతామని తెలిపారు. హోదా సాధనకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కలిసి రావాలని కోరారు. సమావేశంలో సాధన సమితి జిల్లా అధ్యక్షులు జి.నర్సునాయుడు, సిపిఎం, సిపిఐ నాయకులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, బిసి న్యాయవాదుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️