ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సిగ్గుచేటు

Mar 15,2024 21:01 #ukkunagaram, #visakha steel

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్రంలోని మోడీ సర్కారు కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్న వాటిని అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1128 రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ట్రాఫిక్‌, కన్‌స్ట్రక్షన్‌, ఆర్‌ఎండి విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉక్కు కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉక్కునగరంలోని త్రిష్ణా మైదానంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యాన ఉక్కు పరిరక్షణ అంశంపై శనివారం జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఆ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ అంశాన్ని ఉంచడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

➡️