ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశవ్యాప్త పోరాటం

Feb 23,2024 08:18 #ukkunagaram, #visakha steel

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశ వ్యాప్తంగా పోరాటం చేయాల్సిన అవసరముందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1106వ రోజుకు చేరాయి. దీక్షల్లో డబ్ల్యుఎండి, యుటిలిటీస్‌, టౌన్‌ అడ్మిన్‌, టిటిఐ విభాగాల ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు మాట్లాడారు. ప్రభుత్వ రంగం నిర్వీర్యమైతే దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల వల్ల దేశవ్యాప్తంగా అభివృద్ధి నిలిచిపోయిందని తెలిపారు. దేశం అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయిందన్నారు. సొంత గనుల కోసం, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం మూడేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటం తప్పక విజయం సాధిస్తుందని తెలిపారు. త్వరలోనే విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే అవకాశముందని, స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న కాలంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

➡️