ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమం

Mar 8,2024 21:36 #ukkunagaram, #visakha steel

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశ వ్యాప్త ఉద్యమం అవసరమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1121వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ సిఒసిసిపి విభాగానికి చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను అతి తక్కువ ధరకే కార్పొరేట్‌ కంపెనీలు దక్కించుకొని లాభాలను ఆర్జించేందుకు చూడటం దుర్మార్గమన్నారు. ప్రజాధనంతో నిర్మించిన పరిశ్రమలు ప్రజలకే ఉపయోగపడాలని, అలా జరగాలంటే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ జరగాలని తెలిపారు. దీనికోసం దేశ కార్మిక వర్గం నడుంబిగించి పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటమే దీనికి నాంది కావాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయాలని ప్రయత్నిస్తోన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రానున్న కాలంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు, పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️