ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్‌ పునాది వేశారు : రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో నీటి పంపకాలపై వివాదం గత కొన్నేళ్లుగా నడుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం కృష్ణా బోర్డు అధికారులతో తెలంగాణ క్యాబినేట్‌ సమావేశం అయింది. అయితే ఈ సమస్యపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌.. విమర్శలు చేస్తుండడంతో సీఎం రేవంత్‌ రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌, కేటీఆర్‌లు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్‌పై నెట్టివేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలను ప్రచారం చేసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై రేవంత్‌ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ గతంలో పోతిరెడ్డి పాడు నుంచి వైఎస్సార్‌ నీటిని తరలించుకోయారన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి కేసీఆర్‌ దగ్గర అనుమతి తీసుకున్నారని.. ఆ జీవో 2020లో ఆమోదం పొందిందన్న విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్‌ గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఏపీకి లంగి పోయిందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పిందన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పిందని అన్నారు. ఫిబ్రవరి 2 , 2014 నాడు ఆమోదం జరిగిన సమయంలో కేసీఆర్‌ ఎంపీగా ఉన్నారని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. పునర్విభజన చట్టంలోని ప్రతి అక్షరం తనను అడిగే రాశారని కేసీఆర్‌ అన్నారన్నారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయానికి కేసీఆర్‌ పునాదిరాయి వేశారని మండిపడ్డారు. ఈ చట్టానికి కేసీఆర్‌ పార్టీ ఓట్లేసి మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. ఈ చట్టానికి బాధ్యత కేసీఆర్‌, కేశవరావులదేనని అన్నారు. నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించిన తర్వాతే.. 2015 జూన్‌ 18,19 తేదీలల్లో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించిందని తెలిపారు. ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 వాడుకోవాలని ఒప్పందం చేశారని తెలిపారు. తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని హరీష్‌ రావు సంతకం పెట్టారన్నారు. నీటి పంపకాల్లో 50 శాతం వాటా గత ప్రభుత్వం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. హక్కుల ప్రకారం 68 శాతం ప్రకారం 500 టీఎంసీలు పైగా తెలంగాణకు రావాలని స్పష్టం చేశారు. తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌, హరీష్‌ రావు, ఇంజనీర్‌ మురళీధర్‌ రావు ఈ నిర్ణయంపై సంతకాలు పెట్టారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

➡️