బకాయిలడిగితే నిర్బంధం

Jan 10,2024 08:28 #Dharna, #utf

యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన

రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది ఉపాద్యాయుల అరెస్ట్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: బకాయిలడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి దిగింది. న్యాయంగా తమకు రావాల్సినవి ఇవ్వాలని కోరితే గొంతు నొక్కింది. విజయవాడలో నిరసన తెలపడానికి వస్తామంటే ఎక్కడికక్కడ అడ్డుకుంది. ఊరునుండి అడుగు ముందుకు వేయనీయకుండా పోలీసులను మోహరించింది. శాంతియుతంగా దీక్షలు చేస్తామన్నా ససేమిరా అంది. అయినా, బయలుదేరితే అరెస్ట్‌లతో అడ్డుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 18వేల కోట్ల రూపాయల బకాయిల కోసం యుటిఎఫ్‌ చేపట్టిన 36 గంటల దీక్షల సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన దృశ్యాలివి! ఈ మొత్తాన్ని విడుదల చేయాలని పదేపదే విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ కార్యక్రమానికి యుటిఎఫ్‌ పిలుపునిచ్చింది. న్యాయమైన ఈ డిమాండ్‌ను పరిష్కరించాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా ఎక్కడికక్కడ అడ్డుకుంది. విజయవాడకు రాకుండా ఉపాధ్యాయులను అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారయంత్రాంగం వ్యవహరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మంది ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయడంతోపాటు గవర్నర్‌పేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంపైనా పోలీసులు దాడి చేశారు. కార్యాలయంలోకి చొరబడి యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎన్‌ ప్రసాద్‌లను అరెస్ట్‌ చేశారు. నిర్బంధాన్ని ఛేదించి విజయవాడకు చేరుకున్న ఉపాధ్యాయులను బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లలో అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అయినా, లెనిన్‌ సెంటర్‌ నుండి ఉపాధ్యాయులు ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుండి జింఖానా మైదానం వైపు వెడుతున్న ప్రదర్శనను మధ్యలో అడ్డుకుని వందలాదిమందిని అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర నాయకులు పి లక్ష్మీరాజాను కడపలోనే అరెస్ట్‌ చేయగా, రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసరావు, సహ అధ్యక్షులు కె సురేష్‌కుమార్‌, ఎఎన్‌ కుసుమకుమారి, కోశాధికారి పి గోపి మూర్తి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌పి మనోహర్‌ కుమార్‌, ఎస్‌ మురళీమోహన్‌, వి కోటేశ్వరప్ప, ఎస్‌ఎస్‌ నాయుడు, బి సుభాషిణి, కెఎ ఉమామహేశ్వరరావు, నవకోటేశ్వరరావు తదితరులను లెనిన్‌ సెంటర్‌లో అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన ఉపాధ్యాయులను పోలీసులు పలు ఫంక్షన్‌హాల్స్‌లో ఉంచారు. శాంతియుత పద్దతిలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులపై పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని పలువురు ఖండించారు. అనంతరం యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను శతృవులుగా పరిగణిస్తోందన్నారు. తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలను అడిగితే అక్రమంగా నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్ట్‌లు చేయడమేమిటని ప్రశ్నించారు. 2023 సెప్టెంబర్‌ నాటికి బకాయిలను చెల్లిస్తామని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు. తక్షణం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఇలాగే అప్రజాస్వామిక చర్యలకు దిగితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తక్షణం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి రూ.18వేల కోట్ల బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యుటిఎఫ్‌పై నిర్బంధం తగదు : ఎపిటిఎఫ్‌శాంతియుతంగా యుటిఎఫ్‌ ఆధ్వర్యాన నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడం తగదని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు జి హృదయరావు, ఎస్‌ చిరంజీవి అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండేళ్లుగా ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా స్పందించడం లేదని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై త్వరలో అన్ని సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ ద్వారా ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్ట్‌లకు ఆప్టా ఖండన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం అరెస్ట్‌ చేయడం తగదని ఆంధ్రప్రదేశ్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోషియేషన్‌ (ఆప్టా) అక్రమ అరెస్ట్‌లను ఖండించింది. ఆప్టా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎజిఎస్‌ గణపతిరావు, కె ప్రకాష్‌రావు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

➡️