బాలికలు, మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విధాన నిర్ణయం

Mar 26,2024 23:38 #AP High Court, #judgement

– ప్రభుత్వానికి హైకోర్టు సూచన
ప్రజాశక్తి-అమరావతి :బాలికలు, మహిళల అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిస్సహాయ బాలికలు, మహిళలను అక్రమ రావాణా నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడిన వాళ్లకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయితో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. తన కుమార్తెను తన స్నేహితురాలు డబ్బు కోసం వ్యభిచార వృత్తిలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తోందని, తన కుమార్తెను అప్పగించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ రాయలసీమకు చెందిన ఒక మహిళ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బాలికను హైకోర్టులో పోలీసులు హాజరుపర్చారు. బాలికను మంగళగిరిలోని ఉజ్వల హోంలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది. పిటిషనర్‌ స్నేహితురాలిని కూడా పోలీసులు హైకోర్టులో హాజరుపర్చారు. బాలికను అక్రమంగా నిర్బంధించలేదని ఆ మహిళ చెప్పింది. ఆ బాలికే తన వద్దకు మూడు నెలల క్రితం వచ్చిందని, అప్పటి నుంచి తన వద్ద ఉంటోందని చెప్పింది. బాలికను వ్యభిచార వృత్తిలోకి నెట్టేందుకు ప్రయత్నించిన వాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరామ్‌ చెప్పారు. విధాన నిర్ణయం, పునరావాస చర్యలపై నివేదిస్తామని అన్నారు. విచారణ ఏప్రిల్‌ 11కు వాయిదా పడింది.

➡️