మత్స్యకారులకు అండగా ఉంటాం-సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

Mar 12,2024 21:55 #For fishermen funds, #release

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. కాకినాడలో ఓఎన్జీసి పైపు లైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 మత్స్యకార కుటుంబాలకు అయిదవ విడత నగదు సహాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కడం ద్వారా మంగళవారం నుండి వారి ఖాతాల్లో ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఐదు విడతల్లో బాధిత కుటుంబాలకు రూ. 647.44 కోట్లను అందించినట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఒఎన్‌జిసి కూడా మత్సకారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 78 కోట్ల జిఎస్‌పిసిని కూడా 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 మధ్యలో వేట నిషేధ సమయంలో వారికి సహాయం అందించినట్లు తెలిపారు. ‘ గతంలో రూ. 4వేలుగా ఉన్న ఈ భరోసాను రూ. 10 వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. లీటర్‌ డీజిల్‌పై రూ. 9 సబ్సిడి ఇస్తున్నాం. ప్రతి మత్స్యకారునికి ఒక గుర్తింపు కార్డు ఇచ్చి, వారికి సబ్సిడి అందజేస్తున్నాం. దాదాపు 20వేల బోట్లకు రూ. 130 కోట్లకు పైగా డీజిల్‌ సబ్సిడి ఇచ్చాం. వేటకు వెళ్లే మత్స్యకారులు పొరపాటున మరణిస్తే నష్టపరిహారం కింద రూ. 10 లక్షలు అందజేస్తున్నాం’. అని వివరించారు. ఇవేకాక ప్రతి మత్స్యకారుడు తమ కాళ్లమీద నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టుగానీ, ఫిషింగ్‌ హార్బర్‌ గానీ లేదా ల్యాండింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, నాలుగు పోర్టులను వాయువేగంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. దాదాపు రూ. 20 వేల కోట్లతో వీటి అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.

➡️