మోడీని గద్దె దించాలి – మత సామరస్యాన్ని కాపాడాలి

Mar 15,2024 22:10 #nirasana, #Protests against CAA

– సిఎఎకు వ్యతిరేంగా నిరసనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి చర్యలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ముస్లిముల ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మోడీని గద్దె దించాలని కోరారు. సిఎఎను రద్దు చేయాలని, మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని నూర్‌ ఇస్లాం మక్కా మసీద్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సిఎఎను తీసుకురావడం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమే తప్ప మరొకటికాదన్నారు. మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి బిజెపి తన పబ్బం గడుపుకోవాలని చూడటం దుర్మార్గమని తెలిపారు. సిఎఎని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ సిపిఎం, లౌకిక పరిరక్షణ వేదికగా బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రచారం నిర్వహించారు. ముస్లిం, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో వామపక్ష పార్టీలు, ఎపిసిఎల్‌సి, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ.. దేశంలోని బిజెపి ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ముందుకు తీసుకొచ్చి లౌకికతత్వానికి తూట్లు పొడుస్తోందని తెలిపారు. 2019 డిసెంబరు 11న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించినప్పటికీ మూజువాణి విధానంతో బిజెపి ప్రభుత్వం ఆమోదింపచేసిందన్నారు.

దేశ వ్యాప్తంగా ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుందని తెలిపారు. ఇప్పుడు చట్టం రూపంలో తీసుకురావడం దారుణమన్నారు.

➡️