రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించండి

Feb 25,2024 08:31 #samsmarana sabha, #sivareddy

– సింహాద్రి శివారెడ్డి వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు జిల్లా):మతోన్మాద బిజెపితో దేశానికి ప్రమాదకరమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడానికి సిపిఎం కార్యకర్తలు కఅషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు కోరారు. గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సింహాద్రి శివారెడ్డి ఏడవ వర్ధంతి సభను శనివారం మంగళగిరిలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా వక్తలు శివారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు అధ్యక్షతన సభలో వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ.. సింహాద్రి శివారెడ్డి తన జీవితాంతం కార్మిక, కర్షక వర్గ ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బిజెపిని ఓడించడానికి కఅషి చేయడమే శివారెడ్డికి అర్పించే ఘమైన నివాళి అని అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న అన్ని రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని అన్నారు. మరోసారి బిజెపి అధికారానికి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, స్వాతంత్రం అనే పదాలు ఉండవని తెలిపారు. ప్రజా ధనాన్ని లూఠీ చేసి కార్పొరేట్లకు అప్పగిస్తోందన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి భజన చేస్తున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బిజెపి అనుకూలంగా ఉన్న పార్టీలను రాష్ట్రంలో ఓడించాలని కోరారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం శివారెడ్డి పోరాటం చేశారని తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారని చెప్పారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎం.రవి, నాయకులు జన్నా శివశంకర్‌, వై కమలాకర్‌, డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️