రాష్ట్రానికి భారీ వర్ష సూచన

Mar 19,2024 08:10 #forecast, #Heavy rain, #IMD, #State
  •  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జార్ఖండ్‌ రాష్ట్రం నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతన్న ద్రోణి ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి నుండి బుధవారం వరకు ఈ వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. అలాగే పార్వతీ పురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్‌టిఆర్‌, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ పిడుగులతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. నంద్యాల, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొన్నారు. అదే సమయంలో అనంతపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా వుండే అవకాశం వుందని తెలిపారు. పెద్దఎత్తున పిడుగులు, భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు. అలాగే వర్షాలు కురిసేటపుడు చెట్లు, టవర్‌ల కింద వుండొద్దని తెలిపారు. అలాగే పొలాలు, మైదానాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండొద్దని సూచించారు. పొలాల్లో వుండే రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా వుండాలని ఆయన కోరారు.

➡️