రోడ్డు ప్రమాదంలో మార్టూరు సిఐ కి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : ప్రధానమంత్రి బందోబస్తుకు వెళ్లి వస్తున్న సీఐ కారుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్న ప్రమాదంలో సిఐ తీవ్రంగా గాయపడిన ఘటన నెల్లూరు సమీపంలోని నాయుడుపేట వద్ద బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. మార్టూరు సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న పి.అక్కేశ్వరరావు అనంతపురంలో ప్రధానమంత్రి పర్యటన బందోబస్తు పర్యవేక్షించడానికి వెళ్లి తిరిగి వస్తుండగా నాయుడుపేట సమీపంలోని పెళ్ళకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు సిఐ కారుని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కార్‌ లో ముందు సీట్లో కూర్చొని ఉన్న సిఐ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న నాయుడుపేట హైవే పోలీసులు, పెళ్లకూరు ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు అప్పటికే కారులో మంటలు చెలరేగడంతో కార్‌ లో అతి కష్టం మీద సిఐ అక్కేశ్వరావుని బయటకు తీశారు. నాయుడుపేట నుంచి వచ్చిన ఫైర్‌ ఇంజన్‌ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. తీవ్రంగా గాయపడ్డ సిఐ ని 108 వాహనంలో నెల్లూరు అపోలో ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️