రోడ్డెక్కిన రైతులు

Dec 20,2023 10:56 #farmers, #road
  • ధాన్యం టాక్టర్లతో నిరసన
  • అధికారుల హామీతో ఆందోళన విరమణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డెక్కారు. తమ ధాన్యం కొనడం లేదని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ పలు గ్రామాల రైతులు మండలంలోని రావిచెంద్రి కూడలి వద్ద ధాన్యం లోడ్ల ట్రాక్టర్లతో నిరసనకు దిగారు. ఎల్‌ఎన్‌పేట మండలంలో మొత్తం 12 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా ఇప్పటివరకు 2,026 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు ప్రభుత్వం 11 మిల్లులకు అనుమతిచ్చింది. వారు ధాన్యం విలువకు సమానమైన సుమారు రూ.11 కోట్లను బ్యాంకు గ్యారంటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ మొత్తానికి సరిపడా ధాన్యం ఇచ్చేయడంతో ట్రక్‌ షీట్లు జనరేట్‌ కావడం లేదు. దీంతో, మిల్లులకు ధాన్యం తరలింపు సాధ్యం కావడం లేదు. ధాన్యం అమ్ముకునేందుకు మూడు నాలుగుసార్లు తిరుగుతున్నా కొనుగోలు చేయకపోవడంతో బత్తిలి-అలికాం రహదారిపై రైతులు ధాన్యం లోడ్ల ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టారు. దీంతో, ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. సమస్యను పరిష్కరించాల్సిందేనని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధాన్యం కొనకుండా మమ్మల్ని బెదిరిస్తారా’ అంటూ పురుగులు మందు తాగేస్తామంటూ హెచ్చరించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న తహశీల్దార్‌ ఆర్‌.అప్పలరాజు, వ్యవసాయ శాఖ అధికారి పైడిలత వారితో మాట్లాడారు. బ్యాంకు గ్యారంటీలు వచ్చిన వెంటనే వేరే మండలాలకు చెందిన ధాన్యాన్ని రాత్రికిరాత్రే కొనుగోలు చేసి తెల్లవారేసరికి బ్యాంకు గ్యారంటీ పూర్తయిందని మిల్లర్లు చెప్తున్నారని అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో, ఉన్నతాధికారులతో రెవెన్యూ అధికారులు మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వద్ద దింపే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైతుల ఆందోళనతో ధనుకువాడ నుండి వాడవలస, దబ్బపాడు మీదుగా తురకపేట చేరుకునేందుకు వాహనాలను పోలీసులు మళ్లించారు. దీంతో, ఆ రోడ్డు రద్దీగా తయారై భారీ ట్రాఫిక్‌ స్తంభించింది.

➡️