సమస్యలు పరిష్కరించాలని కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం

Jan 12,2024 08:13 #Anganwadi Workers, #nirasana

అంగన్‌వాడీ సంఘాల ప్రకటన

భోగి మంటల్లో ఎస్మా నోటీసులు

సంక్రాంతి తరువాత ఉద్యమం తీవ్రం

మోకాళ్లపై నిలబడి నిరసన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:సమస్యల పరిష్కారం కోసం కోటి సంతకాలు సేకరించాలని అంగన్‌వాడీలు నిర్ణయించారు. ‘జగనన్నకు చెబుదాం..’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరగనుంది. విజయవాడ ధర్నా చౌక్‌లోని దీక్షా శిబిరంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.బేబీరాణి, కె.సుబ్బరావమ్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలిత, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర కార్యదర్శి విఆర్‌ జ్యోతి ఈ విషయం ప్రకటించారు. ‘అంగన్‌వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కోటి సంతకాలతో సిఎంకు వినతిపత్రం సమర్పిస్తాం’ అని వారు చెప్పారు. 31 రోజుల నుండి సమ్మె జరుగుతోందని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఎస్మా నోటీసులను భోగి మంటల్లో వేసి తగులబెడతామని, సంక్రాంతిలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని తెలిపారు. పది సమస్యలు పరిష్కరించామని చెబుతున్నారని, వాటికి సంబంధించి కొన్ని జిఓలు ఇంతవరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. శుక్రవారం చర్చలు జరుపుతామని ఆహ్వానించి మరోవైపు షోకాజు నోటీసులు ఇస్తున్నారని, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇంటికి వచ్చి ఇళ్లలో వారిని నిద్రలేపి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. చర్యలు తీసుకోవడానికి అంగన్‌వాడీలపై ప్రజలెవరూ ఇంతవరకూ ఫిర్యాదులు ఇవ్వలేదని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని అన్నారు. అయినా ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికి నాలుగు దఫాలుగా చర్చలు జరిపారని, కీలకమైన గ్రాట్యుటీ, వేతనాల పెంపుపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ప్రభుత్వం చర్చలకు పిలవడాన్ని ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్‌వాడీలను ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించాలని కోరారు. ఇప్పటి వరకూ శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని, తమకు ఎస్మా వర్తించదని తెలిసినా ప్రయోగించారని, దాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఎస్మా నోటీసులను భోగి మంటల్లో తగులబెడతామని వివరించారు. అంగన్‌వాడీల ఆందోళనలు ఇప్పటి వరకూ సిఎంకు తెలియదని చెబుతున్నారని, ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వేతనాలు పెంచేందుకు సిఎం అంగీకరించడం లేదని అన్నారని చెప్పారు. సిఎంకు విషయమే తెలియనప్పుడు వేతనాలు పెంచలేమని ఎలా చెప్పారని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్‌ సుప్రజ, నాయకులు గజలక్ష్మి, రత్నకుమారి, ఎల్లారాణి తదితరులు పాల్గన్నారు. సమ్మె 31 రోజులకు చేరుకున్న సందర్భంగా అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వైవి, రాంభూపాల్‌ సంఘీభావంఅంగన్‌వాడీల దీక్షా శిబిరానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాంభూపాల్‌ సంఘీభావం ప్రకటించారు. దీక్షలో, శిబిరంలో ఉన్న అంగన్‌వాడీలను ఉద్దేశించి వారు మాట్లాడారు. సమ్మెకు పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం నాయకులు రమాదేవి, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు బాలాజీ, సిఐటియు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు డివి కృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు.

➡️