సమస్యల పరిష్కారానికి యానాదుల ధర్నా

Mar 6,2024 21:00 #cpm dharna, #eluru

ప్రజాశక్తి – భీమవరం: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌ వద్ద యానాదులు ధర్నా చేపట్టారు. భీమవరం 29వ వార్డు ప్రకాష్‌నగర్‌లో డ్రెయినేజీ, ఇళ్ల పట్టాలు, విద్యుత్‌ స్తంభాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఏడో వార్డు గాంధీనగర్‌లో వ్యక్తిగత మరుగుదొడ్లు, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం, పైప్‌లైన్‌ కనెక్షన్లు ఇవ్వాలని నినదించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నానుద్దేశించి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి. బలరాం మాట్లాడుతూ.. యానాదుల సమస్యల పరిష్కారంలో అధికారులు, పాలకులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. వారి సమస్యలపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు అందజేశారు. స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు, నాయకులు డి.త్రిమూర్తులు, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️