సమ్మె విజయవంతం

Jan 24,2024 08:06 #Anganwadi strike, #Success

అంగన్‌వాడీ సంఘాల ప్రకటన

సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన నాయకులు

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :డిసెంబర్‌ 12వ తేదీ నుండి చేపట్టిన సమ్మె విజయవంతం అయిందని అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబీరాణి, కె.సుబ్బరావమ్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఎఐటియుసి) రాష్ట్ర నాయకులు మంజుల, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(ఐఎఫ్‌టియు) ప్రధాన కార్యదర్శి వి.ఆర్‌.జ్యోతి మాట్లాడారు. సోమవారం రాత్రి రెండుగంటల పాటు మంత్రులతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని ప్రకటించారు. యూనియన్లు అడిగిన వాటిలో ఎక్కువ డిమాండ్లు అంగీకరించడంతో సమ్మెను విరమించామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో సిఐటియు అనుబంధ సంఘ ఉపాధ్యక్షులు లక్ష్మీదేవి, చంద్రావతి, ఐఎఫ్‌టియు నాయకులు భారతి, ఎఐటియుసి నాయకులు సరళ పాల్గన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ల వివరాలను వారు వెల్లడించారు. అవి: చర్చల్లో ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లు 1. అంగన్‌వాడీల వేతనాలు జులైలో పెంచుతామని, యూనియన్లకు ప్రభుత్వానికి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన వేతనాన్ని పెంచడానికి రాత.పూర్వక హామీ.2. గ్రాట్యూటీకి సంబంధించి కేంద్రానికి సిఫార్సు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని వర్కర్లకు రూ.50 వేల నుండి రూ.1.20 లక్షలకు, హెల్పర్‌కు రూ.60 వేలు చెల్లించడానికి అంగీకారం, 3.మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్పు చేస్తూ జిఓ ఇస్తామని అంగీకరించారు. త్వరలో జిఓ ఇవ్వనున్నారు4. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. సర్వీసులో ఉండి మరణించిన వారికి అంగన్‌వాడీ బీమా లేదా వైఎస్‌ఆర్‌ బీమా అమలు చేస్తామని తెలిపారు. మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇవ్వడానికి అంగీకారం. .5. హెల్పర్ల ప్రమోషన్‌ వయస్సు 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించారు. ప్రమోషన్లకు నిర్దిష్టమైన నిబంధనలు రూపొందిస్తామని అంగీకరించారు. 6. 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు అమౌంట్‌ కేంద్రం ఇచ్చినప్పుడు అందరికీ ఇస్తామని, ఈ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నెలకు వర్కర్‌కు ఒక టిఏ, రెండు నెలలకు ఆయాలకు ఒక టిఏ చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. దీనికీ జిఓ ఇస్తామని ప్రకటించారు, 7. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపు.8.గ్రేడ్‌ టు సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్ష రాసి పెండింగ్‌లో ఉన్న 164 గ్రేడ్‌ టు సూపర్‌ వైజర్‌ పోస్టులు ఏప్రిల్‌ నాటికి అమలు చేస్తామని హామీనిచ్చారు.9. నాలుగు యాప్‌లు కలిపి ఒక యాప్‌గా మార్చడానికి అంగీకారం, 10. వేతనంతో కూడిన మెడికల్‌ లీవు, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూఛార్జి, మెనూ పెంపు, గ్యాస్‌ తదితర సమస్యల పరిష్కారానికి కమిటీ వేసి చర్చించి నిర్ణయించనున్నారు.11. సమ్మె కాలానికి జీతాలు చెల్లించడానికి, సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. కక్షసాధింపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడదని మంత్రుల బృందం తెలిపింది. అంగీకరించిన అన్ని అంశాలూ కూడా మూడు రోజుల్లో మినిట్స్‌ కాపీని అందిస్తామని చర్చల్లో ప్రభుత్వ తరపు ప్రతినిధులు హామీనిచ్చారు.

➡️