సురక్షిత ప్రదేశంలోకి కంటైనర్‌ ?

Mar 24,2024 22:19 #drugs case, #Visakha

– సిబిఐ ఆదేశాలతో సరుకుకు భద్రత
– నాలుగైదు రోజుల్లో శాంపిల్స్‌ ఫలితాలు
ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :విశాఖపట్నం పోర్టు టెర్మినల్‌లో సిబిఐకి పట్టుబడ్డ 25 వేల కిలోల డ్రగ్‌ కంటైనర్‌ను ఇప్పుడున్న ప్రదేశం నుంచి అదే టర్మినల్‌లోగల మరింత సురక్షిత ప్రదేశానికి సిబిఐ అధికారులు ఆదివారం రాత్రి తరలించినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం కంటైనర్‌లోని డ్రై ఈస్ట్‌ శాంపిల్స్‌ను ఢిల్లీకి పంపారు. ప్రభుత్వ సెలవులు కావడంతో నాలుగు రోజులు ఆలస్యంగా అంటే ఈ నెల 29వ తేదీ నాటికి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డ్రై ఈస్ట్‌ (రొయ్యల మేత)లో ఎంత శాతం డ్రగ్‌ కలిసి ఉందన్న అంశం, మొత్తంగా 25 వేల కిలోల్లో ఎంత డ్రగ్‌ పరిమాణం ఉందన్న విషయం త్వరలో శాంపిల్‌ ఫలితాలతో బయటపడనున్నాయి. బ్రెజిల్‌ నుంచి ఇన్‌యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ పేరుతో విశాఖపట్నం పోర్టు కంటైనర్‌లోకి వచ్చిన ఈ 25 వేల కిలోల డ్రగ్స్‌ను సిబిఐ అధికారులు అక్కడికక్కడే తనిఖీలు చేసి సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. కంటైనర్‌ను ఆర్డర్‌ చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీకి చెందిన రాష్ట్రంలోని కాకినాడ, విశాఖపట్నం, కృష్ణా జిల్లా పామర్రు ప్రాంతాల్లో డాక్యుమెంట్ల పరిశీలన ఈ నెల 23న పూర్తయినట్లు తెలుస్తోంది. సరుకు ఎగుమతి, దిగుమతులపైనా, కొన్నాళ్లుగా ఈ సంస్థ చేపట్టిన కార్యకలాపాలపైనా సిబిఐ తాజాగా దృష్టిసారించినట్లు సమాచారం. ప్రస్తుతం టెర్మినల్‌లో సీజ్‌ చేయబడ్డ 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌కు కేంద్ర బలగాలతో రాత్రీ, పగలు గస్తీ ఏర్పాటు చేశారు.

➡️