‘సెకీ’ ఒప్పందంపై బహిరంగ విచారణ జరపండి -ఎపిఇఆర్‌సికి సిపిఎం లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:అదానీ సంస్థల ద్వారా సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఎపిఇఆర్‌సి)ని సిపిఎం కోరింది. ఈ మేరకు ఇఆర్‌సి కార్యదర్శికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు బుధవారం లేఖ రాశారు. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) ద్వారా రాజస్థాన్‌లోని అదానీ సంస్థల నుంచి 17వేల మిలియన్‌ యూనిట్ల(ఎంయు) సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు అనుమతి కోరుతూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు పంపినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందం వల్ల విద్యుత్‌ వినియోగదారులపై తీవ్రమైన ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ కంపెనీలతో ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని వివిధ బహిరంగ విచారణల్లో సిపిఎంతో పాటు పలు సంస్థలు, విద్యుత్‌ రంగ నిపుణులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఒప్పందాల వల్ల విద్యుత్‌ వినియోగదారులపై భారాలు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ దీర్ఘకాలిక ఒప్పంద ప్రతిపాదనలు ప్రజలకు, విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని వివరించారు. పారదర్శకత లేకుండా, వాస్తవాలు బహిర్గతం చేయకుండా ప్రభుత్వ ఆదేశాలతో ఇటువంటి ఒప్పందాలకు పూనుకోవడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని బహిర్గతం చేసి, బహిరంగ విచారణ జరపి హానికరమైన ఒప్పందాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మండలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థలు, వినియోగదారులు తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశం చట్టప్రకారం కల్పించాలని కోరారు.

పలువురు నిపుణులు కూడా..

ఇదే అంశంపై బహిరంగ విచారణ జరపాలని కోరుతూ విద్యుత్‌ రంగ నిపుణులు ఎం వేణుగోపాల రావు, బి తులసీదాస్‌, ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌కు చెందిన ఎన్‌ శ్రీకుమార్‌, పీపుల్స్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ ఆన్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కన్వీనర్‌ ఎం తిమ్మారెడ్డి ఎపిఇఆర్‌సికి విడివిడిగా లేఖలు రాశారు.

➡️