జగనన్న కాలనీల్లో రూ.35 వేల కోట్ల అవినీతి : నాదెండ్ల మనోహర్‌

35-thousand-crores-corruption-in-Jagananna-colonies-Nadendla-Manohar

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగనన్న కాలనీల కోసం చేపట్టిన భూసేకరణలో వైసిపి ప్రజా ప్రతినిధులు రూ.35,141 కోట్ల అవినీతికి పాల్పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. గురువారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసిపి సర్కారు పేదలను వంచిస్తోందన్నారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని, గుంకలాం ఇళ్ల పరిశీలన సమయంలో పవన్‌కల్యాణ్‌ అప్పుడే చెప్పారని మనోహర్‌ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పిన లెక్కలకు, ప్రభుత్వ ప్రకటనలకు పొంతన లేదన్నారు. వైసిపి నాయకుల మధ్య వాటాల పంపకంలో గొడవలు రావడంతో అవినీతి లెక్కలు బయటకు వస్తున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో వైసిపి ప్రజా ప్రతినిధులు, అధికారులు, చివరకు కలెక్టరు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే చేసిన భూసేకరణపై విజిలెన్స్‌ విచారణకు డిమాండ్‌ చేశారు. 95 వేల మంది లబ్ధిదారులు తమకు ఇళ్ల పట్టాలు వద్దని అధికారులకు చెప్పారన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో గృహ నిర్మాణానికి ఇచ్చిన బడ్జెట్‌ రూ.16,815 కోట్లని, చేసిన వ్యయం రూ.8,250 కోట్లు మాత్రమేనని అన్నారు.

➡️