41-ఎ నోటీసు ఇచ్చినా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారించొచ్చు : హైకోర్టు

Mar 29,2024 23:30 #AP High Court, #judgement

ప్రజాశక్తి-అమరావతి :నిందితులు తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్‌ 41ాఎ కింద నోటీసు జారీ చేశాక నిందితులు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు అరెస్టు చేస్తారని నిందితుడు భావించినప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేస్తే దానికి విచారణార్హత ఉంటుందని జస్టిస్‌ టి మల్లికార్జునరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 41ాఎ నోటీసు ఇచ్చినా అరెస్టు ఆందోళన ఉన్నప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టులు విచారిస్తాయని చెప్పారు.
ఫేస్‌బుక్‌ ఫేక్‌ ఐడిలను తయారుచేసి వైఎస్‌ షర్మిల, వైఎస్‌ సునీత కీర్తిప్రతిష్టలను దెబ్బతిసేలా చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విశాఖపట్నానికి చెందిన పినపల ఉదయూషణ్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనరుకు 41-ఎ నోటీసు ఇచ్చామని, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని పోలీసులు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. పులివెందుల ఎస్‌హెచ్‌ఒ ఎదుట హాజరై బెయిల్‌ షరతులను అమలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. మూడు నెలలపాటు ప్రతి 15 రోజులకోసారి కడప జిల్లా ఎస్‌పి ఎదుట హాజరుకావాలంది.

➡️