హైదరాబాద్‌కు 43మంది జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు

Feb 3,2024 08:29 #43 Jharkhand MLAs, #hyderabad

షామీర్‌పేటలోని లియోనా రిసార్ట్‌లో క్యాంపు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:జార్ఖండ్‌ రాజకీయ పరిణామాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. జెఎంఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. టిపిసిసి నేతలు వారిని రెండు బస్సుల్లో ప్రత్యేక బందోబస్తు నడుమ షామీర్‌పేటలోని లియోనా రిసార్ట్‌కు తరలించారు. జార్ఖండ్‌ రాష్ట్ర నూతన సిఎంగా జెఎంఎం నేత చంపారు సోరెన్‌ ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఈ నెల 5న బలపరీక్ష నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా జెఎంఎం, కాంగ్రెస్‌ నాయకత్వం వీరికి హైదరాబాద్‌లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. జార్ఖండ్‌ ఎమ్మెల్యేలకు సహాయకులుగా తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను టిపిసిసి నియమించింది. నలుగురు ఎమ్మెల్యేలకు ఒకరు చొప్పున టిపిసిసి ఏర్పాట్లు చేసింది. రిసార్ట్‌ పరిసరాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రానికే వారు హైదరాబాద్‌లోని క్యాంపునకు రావాల్సి ఉన్నా రాంచీలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వారి ప్రయాణం వాయిదాపడింది. జార్ఖండ్‌ ఎమ్మెల్యేల వెంట ఆ రాష్ట్ర పిసిసి నాయకులూ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్‌ మున్షి ఎప్పటికప్పుడు ఎఐసిసి నాయకులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

➡️