పాలిసెట్‌కు 88.74 శాతం మంది హాజరు

Apr 27,2024 20:56 #Exam, #Poliset

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రవ్యాప్తంగా 422 పరీక్షా కేంద్రాల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పాలిసెట్‌ పరీక్ష ప్రశాతంగా ముగిసింది. 2024-25 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన ఈ పరీక్ష రాసేందుకు 1,59,989 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,41,978 (88.74శాతం) మంది హాజరయ్యారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ సురేష్‌ కుమార్‌ విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణను పరిశీలించారు. రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్‌ సిహెచ్‌ నాగరాణి తాడేపల్లిగూడెం, ఏలూరులో పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ నెల 30న ప్రాథమిక ‘కీ’ని apsbtet.ap.gov.in లో పొందుపర్చుతామని కమిషనర్‌ తెలిపారు. వచ్చే మే నెల 10లోపు ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జూన్‌ మొదటి వారం నుంచి తరగతుల నిర్వహణకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేశామని తెలిపారు.

➡️