మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం

Dec 10,2023 08:23 #Minister Appalaraju, #srikakulam

-హామీలు నెరవేర్చకపోవడంపై పోర్టు నిర్వాసితుల నిలదీత

ప్రజాశక్తి- నౌపడ (శ్రీకాకుళం జిల్లా)శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పోర్టు వద్ద మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. పోర్టు పనుల నిర్మాణ ప్రగతిని పరిశీలించడానికి ఆయన వచ్చారు. పోర్టు ముఖద్వారం వద్ద ఆయన కాన్వారుని నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో, మంత్రి వాహనం దిగి వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా, నిర్వాసితులు శాంతించలేదు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయాలని నిలదీశారు. చాలామందికి ఇంతవరకూ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబం ప్యాకేజీ (పిడిఎఫ్‌లు) పడలేదని, జీడి మొక్కలకు పరిహారం ఇవ్వలేదని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు నిర్వాసిత కాలనీ ఎత్తు పెంచాలని కోరినా జిల్లా అధికారుల్లో స్పందన లేదన్నారు. స్థానికులకు ఉపాధి కల్పించడం లేదని, ఇతరులకు నెలకు రూ.18 వేలు జీతం ఇస్తున్నారని, అదే పనిచేస్తున్న స్థానికులకు మాత్రం రూ.9 వేలు ఇస్తున్నారని, వీటిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. పోర్టు నిర్మాణ పనుల పరిశీలన అనంతరం మాట్లాడుకుందామని మంత్రి అనగా… ఇక్కడ కాదని, మూలపేటలో ప్రజల సమక్షంలో సమావేశం పెట్టి సమాధానం చెప్పాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కరించడానికే తాను, కలెక్టర్‌ ఇక్కడికి వచ్చామని, సమస్యలు చర్చించుకునే పద్ధతి ఇది కాదని, బహిరంగంగా మాట్లాడితే ఈ విషయాన్ని పత్రికలు రాద్ధాంతం చేస్తాయని మంత్రి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం పోలీసుల సహకారంతో పోర్టులోకి వెళ్లిన మంత్రి చాలా సమయం వరకూ బయటకు రాలేదు. దీంతో, నిర్వాసితులు అక్కడి నుంచి వెనుదిగిరారు. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి పోర్టు నుంచి బయటకు వచ్చి తిరుగు పయనమయ్యారు.

➡️