రజకుల భద్రతకు సామాజిక రక్షణ చట్టం చేయాలి

Jun 26,2024 22:20 #A social protection, #vinathi

– మంత్రి సవితకు రజక వృత్తిదారుల సంఘం వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వివక్ష, దాడులకు గురవుతున్న రజకులకు భద్రత కల్పించేందుకు సామాజిక రక్షణ చట్టం చేయాలని ఎపి రజక వృత్తిదారుల సంఘం డిమాండ్‌ చేసింది. అలాగే రజకుల అభివృద్ధి కోసం కార్పొరేషన్‌కు తక్షణం విధి విధానాలు రూపొందించి నిధులు విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య, కోశాధికారి వల్లభాపురం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు లింగాల నిర్మలమ్మ, నాయకులు బజ్జ సుబ్బారావు, పాగోలు శ్రీనివాస్‌, చిక్కవరపు రెడ్డయ్య, పాండు రంగారావు, తోట సుబ్బారావు, నూతక్కి నాగేశ్వరరావు తదితరులు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్‌ సవితను కలిసి వినతిపత్రం అందజేశారు. టిడిపి కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రజకులకు సామాజిక రక్షణ చట్టాన్ని చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు ఆధునిక దోబీ ఘాట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆదరణ పథకం ద్వారా రజక వృత్తిదారులకు అవసరమైన పనిముట్లు వెంటనే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 50 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలన్నారు. తమ ప్రభుత్వం బిసిల అభివృద్ధికి కట్టుబడి వుందని, తక్షణం రజకుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘానికి మంత్రి ఎస్‌ సవిత హామీ ఇచ్చారు.

➡️