Protest – ఉద్యోగ భద్రత కల్పించాలి – గురుకుల అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయుల ఆందోళన

ప్రజాశక్తి – పెదబయలు (అల్లూరి జిల్లా) :ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు శనివారం పెదబయలులో ఆందోళన చేపట్టారు. ఎంతో కాలంగా గిరిజన గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్న తమకు ఉపాధ్యాయ నియామకాల్లో అన్యాయం చేస్తున్నారంటూ వారంతా వాపోయారు. తొలుత పెదబయలులోని గురుకుల కళాశాల, పాఠశాలల్లో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు తాడేపల్లికి బయలుదేరారు. 15 ఏళ్లుగా గిరిజన గురుకులాల్లో తాము పనిచేస్తున్నామని, ఐటిడిఎ అధికారులు మోడ్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌ ద్వారా అతి తక్కువ వేతనం ఇస్తూ తమతో పనిచేయించుకుంటున్నారని తెలిపారు. ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వర్తిస్తూ విద్యార్థుల నుండి ఉత్తమ ఫలితాలు సాధించిపెడుతున్న తమపట్ల నిర్లక్ష్యం తగదన్నారు. గెస్ట్‌, పార్ట్‌టైం, అవుట్‌ సోర్సింగ్‌, థర్డ్‌ పార్టీల పేర్లతో వేతనాలు చెల్లిస్తూ కాలం వెల్లబుచ్చడం దారుణమన్నారు. ఎంత కష్టపడుతున్నా రూ.14 వేల వేతనమే దక్కుతోందని తెలిపారు. ప్రభుత్వ బెనిఫిట్స్‌ ఏవీ అందడం లేదని వాపోయారు. సిఎం చంద్రబాబు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్డడం మంచిదే అయినప్పటికీ గురుకులాల్లో పోస్టుల భర్తీ జరిగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించి ప్రస్తుతం విధుల్లో ఉన్నవారిని గురుకులం నిబంధనలను అనుసరిస్తూ రూల్‌ ఆఫ్‌ పొజిషన్‌లో ఉపాధ్యాయులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించి మెరుగైన వేతనం ఇవ్వాలని కోరారు.

➡️