తరగతి గది నుండే విద్యార్థి జీవితం ప్రారంభం

  • విద్య ద్వారానే గ్రామం నుండి దేశం వరకు అభివృద్ధి
  •  ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో జస్టిస్‌ ఎన్‌వి రమణ

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తరగతి గదిలో ప్రారంభమయ్యే విద్యార్థి జీవితం, చదువుకునే రోజుల్లోనే వారి జీవితం తిరోగమనమో, పురోగమనమో తేలిపోతుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లి పరిధిలో ప్రముఖ అనస్తీషియా వైద్యులు, మధర్‌ థెరిస్సా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ నాగోతు ప్రకాశరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్‌ నేషనల్‌ ఫ్రాంచైజ్‌ అధిపతి సుభాష్‌ కలువ అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్‌ ఎన్‌.వి రమణ మాట్లాడుతూ నాణ్యమైన విద్య ద్వారానే గ్రామం నుండి దేశం వరకు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పాఠశాల దశ ఎన్నో నేర్పిస్తుందని, మంచి అలవాట్లు, మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలపట్ల గౌరవం విద్యార్థులకు పెరిగేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలదేనన్నారు. పాఠశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ డాక్టర్‌ నాగోతు ప్రకాశరావు మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఎంత ఎదిగినా పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, తల్లిదండ్రులను, గురువులను, వారి కష్టాన్ని మర్చిపోకూడదన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన పల్నాడులో లాభాపేక్షకు తావు లేకుండా విద్యాభివృద్ధి కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన తాను డాక్టర్‌గా ఎదిగానని, చదువు విలువ తెలుసని అన్నారు. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్‌ చక్రధర్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఎన్‌ఎన్‌ రాజు, వి.వెంకట నరసయ్య, ఆర్‌డిఒ పి.సరోజిని, నరసరావుపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆనంద్‌పాల్‌, తిరుమల ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ ఆర్‌.సత్యనారాయణ, డాక్టర్‌ ఎన్‌.వెంకట్రావు, ఎన్‌.శౌరయ్య పాల్గొన్నారు.

➡️