బొమ్మలపల్లిలో గాలివాన బీభత్సం – అంధకారంలో గ్రామం

May 10,2024 09:45 #darkness, #Kadapa, #Rain effect, #villages

జమ్మలమడుగు (కడప) : కడప జిల్లా జమ్మలమడుగు నియోజవర్గం జమ్మలమడుగు మండలంలోని పి బొమ్మపల్లి గ్రామంలో గురువారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి గాలి బీభత్సానికి గునకొనపల్లి లక్ష్మీదేవి వైఫ్‌ ఆఫ్‌ చౌరెడ్డి అనే మహిళ రేకు ఇంటి పైకప్పు మొత్తం లేచిపోయి అరకిలో మీటరు దూరంలో పడిపోయింది. అయితే ఇంట్లో ఉన్న గునకనపల్లి లక్ష్మీదేవి ఆమె మనవడు గాలి శబ్దానికి భయపడి వారి పక్క ఇంటికి వెళ్ళిపోతూ ఉండగానే ఇంటి పై కప్పు రేకులు కళ్ళముందే గాలికి లేచిపోతూ కనబడుతున్నా ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నారు. ఇంట్లో టీవీ, ఫ్యాను నిత్యావసర వస్తువులు అన్ని దెబ్బతిన్నాయి. కర్రు రఘునాథరెడ్డి వీధిలో కర్రు పెద్ద బాలిరెడ్డి ఇంటి వద్ద ఉన్న కరెంటు స్తంభం లైన్‌ ఈదురుగాలికి తెగిపోయింది. మరికొన్ని చోట్ల కరెంటు లైన్స్‌ చుట్టుకుపోయాయి. కరెంటు లైన్‌ తెగిపోవడంతో గ్రామం మొత్తం రాత్రి అంతా అంధకారంలో ఉండిపోయింది. ఉప్పులూరి వెంకటరామిరెడ్డి బోధకొట్టం గోడలు గాలీ, ఉరుములకు నేల కొరిగాయి. గ్రామస్తురాలు జి.లక్ష్మీదేవి వివరణ ఇస్తూ దాదాపు రెండు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విద్యుత్తులైన్‌ను పునరుద్ధరించాలని కరెంటు అందేలా చేయాలని గ్రామస్తులు కోరారు.

➡️