డిఎస్‌సిలో అప్రెంటిస్‌ రద్దు

May 6,2024 22:11 #2024 election, #chandrababau, #TDP
  •  ముస్లిం రిజర్వేషన్లు కాపాడతాం
  •  ప్రజాగళం సభలో చంద్రబాబు హామీ

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : తాము డిఎస్‌సిలో అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ వద్ద నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. తాము ముస్లిం రిజర్వేషన్లు కాపాడతామని, అధికారంలో ఉండి ఉంటే ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసే వాళ్ళమని, జగన్‌ వచ్చి అన్నింటిని అటకెక్కించారని విమర్శించారు. తల్లిని చూసుకోని వారు ప్రజలను చూసుకుంటారా? అని ప్రశ్నించారు. చెల్లి చీర గురించి మాట్లాడడం మానసిక వైకల్యం అవునా? కాదా? అని ప్రజలను అడిగారు. ఏ కేసులు లేకున్నా తమను నంద్యాలలో అరెస్టు చేశారని అన్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. జగన్‌ ఐదేళ్లు పరదా కట్టుకొని తిరిగి చెట్లన్ని నరికేశారని, ఇప్పుడు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వస్తున్నారని విమర్శించారు. ప్రజా వేదిక ను కూల్చి విధ్వంసానికి నాంది పలికారని, రాజధానిని, పోలవ రాన్ని నాశనం చేశారన్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరైనా బాగు పడ్డారా? అని ప్రశ్నించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఒక నల్ల చట్టమని, ఆస్తులు కొట్టేసేవాడు కావాలా ఆస్తులు పెంచేవాడు కావాలా అని ప్రజలనుద్దేశించి కోరారు. మళ్లీ అన్న క్యాంటీన్‌, రంజాన్‌ తోఫా, దుల్హన్‌, పండుగ కానుకలు కావాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. పాణ్యం నియోజకవర్గానికి ప్రతిరోజు నీళ్లు ఇస్తామని, హంద్రీనీవా ద్వారా ఓర్వకల్లు, కల్లూరుకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. సభలో టిడిపి ఎంపి అభ్యర్థి బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు.

➡️