ట్రిపుల్‌ఐటిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

May 7,2024 12:51 #IIIT, #notification, #released

ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా) : ఆర్‌జెయుకెటి యూనివర్సిటీ పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్‌ఐటిలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నిమిత్తం సోమవారం అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పదో తరగతి ఫలితాలు వచ్చినప్పటి నుంచి విద్యార్థులు ట్రిపుల్‌ఐటి నోటిఫికేషన్‌ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్‌ సకాలంలో అధికారులు విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్‌ఐటి కళాశాలలో దరఖాస్తు కోసం విద్యార్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ట్రిపుల్‌ఐటిలో సీటు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సీట్లు కేటాయింపులో ఎపి విద్యార్థులకు 85 శాతం వాటా కల్పిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రిపుల్‌ఐటి విద్యార్థులకు రెండేళ్ల పియూసితోపాటు, నాలుగేళ్ల బీటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సును బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడులో ట్రిపుల్‌ఐటి క్యాంపస్‌లున్నాయి. వీటిల్లో 4,400 సీట్లు ఉన్నాయి. ఒక్కో ట్రిపుల్‌ ఐటికి 1100 ప్రకారం సీట్లు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్‌ వృత్తి విద్యా కోర్సులు చదవాలనే ఆశయంతో ట్రిపుల్‌ఐటిలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది వీలైనంత తొందరగా ప్రవేశాల ప్రక్రియ ముగించి, జులై నాటికి తరగతులు ప్రారంభించా లని అధికారులు ప్రణాళిక రూపొం దిస్తున్నారు.

➡️