ప్రధానిపై చర్యలు తీసుకోవాలి : ఇండియా వేదిక నేతల డిమాండ్‌

  • మోడీ వ్యాఖ్యలపై విజయవాడలో పలుచోట్ల నిరసన

ప్రజాశక్తి- విజయవాడ : ప్రధాని మోడీ విద్వేష ప్రసంగాలను ఖండిస్తూ ఇండియా వేదిక పార్టీలైన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ ఆధ్వర్యాన మంగళవారం విజయవాడలో పలుచోట్ల నిరసన తెలిపారు. మోడీపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ గవర్నరుపేటలోని శ్రీశ్రీ భవన్‌ వద్ద, సెంట్రల్‌ నియోజకవర్గంలోని 30 డివిజన్‌, దేవీ నగర్‌, రామకృష్ణాపురం తదితర ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. మోడీ దుర్మార్గపూరిత ప్రసంగాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, కాంగ్రెస్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు వి.గురునాథం, సిపిఐ ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, ఆప్‌ నాయకులు పరమేశ్వరరావు మాట్లాడుతూ మత చిచ్చు రేపుతూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న మోడీకి ప్రధాని పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. 2014 ఎన్నికల్లో స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్లడబ్బును వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోడీ నమ్మించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచాక నల్ల డబ్బున్న అక్రమార్కులకు బిజెపి, మోడీ కాపాలాదారుగా ఉన్నారని, ఒక్క రూపాయి నల్ల డబ్బు కూడా స్వాధీనం చేసుకోలేదని వివరించారు. ప్రస్తుత ఎన్నికల ముందు మరలా ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారన్నారు. హిందువుల ఆస్తులను ముస్లిములకు కట్టబెడతారంటూ బహిరంగంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులైన ముస్లిములను చొరబాటుదారులుగా ముద్ర వేసి విద్వేషాలను రగిలిస్తున్నారని విమర్శించారు. కంచే చేను మేసినట్లుగా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రధాని మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వివరించారు. భారతీయులైన హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు… ఇలా అన్ని తరగతుల ప్రజలనూ గత పదేళ్లలో పన్నుల పేరుతో బిజెపి పీల్చి పిప్పి చేసిందని విమర్శించారు. మన రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతలైన జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు వీటిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాజ్యాంగం, లౌకికతత్వం పట్ల వారికి చిత్తశుద్ధి ఉంటే మోడీ విద్వేష ప్రసంగాలను ఖండించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, సిపిఐ నగర నాయకులు కెవి.భాస్కరరావు, సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️