చంద్రయ్యకు గుణపాఠం

Jul 1,2024 04:25 #jeevana

కృష్ణాపురంలో ఉండే రామయ్య పచారి కొట్టు నడుపుతున్నాడు. అతను అందరితో స్నేహంగా ఉంటాడు. ఉన్న దాంట్లో సహాయపడతాడు. అదే ఊర్లో ఉండే చంద్రయ్యకు రామయ్య అంటే గిట్టదు. ఒక రోజు అతడు రామయ్య పచారి కొట్టులో బియ్యం కొని తీసుకెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం జమీందారు వద్దకు వెళ్లి ‘రామయ్య బియ్యంలో రాళ్లు కలిపి అమ్ముతున్నాడు. ఈ రోజు ఉదయం అతను అమ్మిన బియ్యం వండుకుని తిన్నాము. ఆ రాళ్ల వల్ల నా నోటి పన్ను విరిగి పోయింది’ అని చెప్పాడు.
జమీందారు రామయ్యను పిలిపించి, అడిగాడు.
‘అయ్యా, నేను మంచి బియ్యమే అమ్ముతున్నాను. కావాలంటే తనిఖీ చేయించండి.’ అన్నాడు రామయ్య. ‘నీ వల్ల చంద్రయ్య పన్ను విరిగిపోయింది. ఇందుకు గాను నీవు అతనికి వెయ్యి రూపాయలు పరిహారంగా ఇవ్వాలి’ అన్నాడు జమీందారు. ‘అలాగే అయ్య గారు’ అని చంద్రయ్యకు వెయ్యి రూపాయలు పరిహారంగా ఇచ్చాడు రామయ్య.
కొన్ని రోజుల తరువాత చంద్రయ్య వద్ద పని చేసే మేకల కాపరి మేకలను తోలుకుంటూ రామయ్య కొట్టు ముందు నుంచి వెళుతుండగా అందులోని ఒక మేక నాలుగు అరటి పండ్లు తినేసింది. రామయ్య ఆ మేకను పట్టుకుని జమీందారు వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పాడు.
జమీందారు పిలుపుతో చంద్రయ్య వచ్చి విషయం తెలుసుకున్నాడు. ‘చూడు చంద్రయ్యా! నీవు రామయ్యకు రెండు వేల రూపాయలు పరిహారంగా ఇవ్వాలి’ అన్నాడు జమీందారు. ‘అయ్యగారూ! నాలుగు అరటి పండ్లు తిన్నందుకు రెండు వేలు పరిహారంగా ఇవ్వమనడం న్యాయబద్ధంగా లేదు’ అన్నాడు చంద్రయ్య. ‘ఏదైనా తప్పు తప్పే!’ అన్నాడు జమీందారు.
‘అయ్యగారూ! నోరు ఉండి అబద్దాలు చెప్పే మనుషుల కన్నా నోరు లేని జంతువు చేసిన తప్పును క్షమించవచ్చు. నాకు పరిహారం అక్కరలేదు’ అన్నాడు రామయ్య. ‘చంద్రయ్యా! చూశావా రామయ్య మంచితనం’ అన్నాడు జమీందారు. ‘క్షమించండి అయ్య గారూ! నేను గతంలో అబద్ధం చెప్పి, రామయ్య నుంచి పరిహారంగా తీసుకున్నాను’ అని ఆ డబ్బును రామయ్యకు తిరిగి ఇచ్చేశాడు చంద్రయ్య.
అటు పిమ్మట చంద్రయ్య ప్రతి ఒక్కరితో మంచిగా ఉండసాగాడు.
– యు.విజయశేఖర రెడ్డి,
99597 36475.

➡️