ఎనిమిది నుంచి అంగన్‌వాడీల సమ్మె- ఆ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

Dec 2,2023 08:41 #press meet, #subbaravamma

ప్రజాశక్తి – గుంటూరు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామన్న సిఎం హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అంగన్‌వాడీలు సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అనేకమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సిఐటియు, ఐఎఫ్‌టియు, ఎఐటియుసి, అంగన్‌వాడీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సమ్మెలోకి వెళుతున్నట్లు చెప్పారు. పేద గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అనేక సేవలు చేస్తున్న అంగన్‌వాడీల పట్ల చిన్నచూపు తగదన్నారు. కొత్త కొత్త యాప్‌లు తెచ్చి పనిభారం పెంచుతున్నారని తెలిపారు. అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో 5600 మినీ సెంటర్లు ఉన్నాయని, వర్కర్సే హెల్పర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన అంగన్‌వాడీ హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్న జిఒ ఉన్నా కొన్ని చోట్ల రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. 35 సంవత్సరాల పాటు సేవలు అందించినా మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, బాల సంజీవనిలో నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని కోరారు. మెనూ ఛార్జీలు పెంచాలని, సెంటర్‌ అద్దెలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చీఫ్‌ సెక్రెటరీతో జరిగిన చర్చలలో పురోగతి లేదని, కావున నిర్దిష్టమైన హామీ ఇచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.దీప్తి మనోజ, నగర కార్యదర్శి టి.రాధ, నగర అధ్యక్షులు కె.చిన్నవెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️