మరో 2,375 బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటన..!

Jan 26,2024 15:45 #speech, #tsrtc md sajjanar

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కేంద్ర కార్యాలయం బస్‌ భవన్‌లో శుక్రవారం గణతంత్ర దినోత్సవంలో పాల్గన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. టీఎస్‌ఆర్టీసీని ఆదరిస్తోన్న ప్రజలకు, సంస్థ అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భారత దేశానికి వచ్చిందని, ప్రతి పౌరుడు దేశ పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. శుభదినం రోజున భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మహానీయుడిని స్మరించుకోవాలన్నారు.మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లో సమర్థవంతంగా సంస్థ అమలు చేసిందని గుర్తు చేశారు. సంస్థకు చెందిన 7200 పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో ప్రస్తుతం మహాలక్ష్మి స్కీం విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పడానికి తనకెంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే 1325 డీజిల్‌, మరో 1,050 ఎలక్ట్రిక్‌ బస్సులు వాడకంలోకి తెస్తుందన్నారు. ఈ 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్‌ చేస్తుందన్నారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌ను చేపడుతామన్నారు. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని, కరీంనగర్‌లో అపాయిట్మెంట్‌ లెటర్లను మంత్రి అందజేస్తారన్నారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్‌ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారన్నారు.టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది పెండింగ్‌ అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వివరించారు. ఈ గణంతంత్ర వేడుకల్లో విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగ అధికారులకు మెడల్స్‌తో, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాల్లో అత్యధిక యూనిట్లు సేకరించిన హకీంపేట, చెంగిచర్ల, కంటోన్మెంట్‌ డిపో మేనేజర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

➡️