రైతు వ్యతిరేక బడ్జెట్‌- ప్రతులను దగ్ధం చేసి నిరసన

Feb 4,2024 09:47 #andholana, #anti-farmer budget

ప్రజాశక్తి- యంత్రాంగం :  కేంద్ర బడ్జెట్‌లో రైతులకు, వ్యవసాయ కార్మికులకు తీరని అన్యాయం జరగడం పట్ల సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు బడ్జెట్‌ ప్రతులను శనివారం దగ్ధం చేసి నిరసన తెలిపారు. రైతు సంఘాలు, సిఐటియు ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ బడ్జెట్‌ కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని వక్తలు విమర్శించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో టవర్‌ క్లాక్‌ వద్ద కేంద్ర బడ్జెట్‌ ప్రతులను దగ్ధం చేశారు. ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.కృష్టమూర్తి, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ముష్కిన్‌, ఎం.పోతలయ్య తదితరులు పాల్గన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రైతులకు, కార్మికులకు, సామాన్య ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి బడ్జెట్‌ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్లకు దోచిపెట్టేలా ఈ బడ్జెట్‌ ఉందని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో బడ్జెట్‌ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర మాట్లాడారు. ఏలూరులో జ్యూట్‌మిల్లు సెంటర్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద కేంద్ర బడ్జెట్‌ ప్రతులను దగ్ధం చేశారు. కార్పొరేట్లకు రాయితీలు-ప్రజలపై భారాల బడ్జెట్‌ అంటూ నినదించారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్‌లో నిరసన తెలిపారు. తాడిపత్రిలో కేంద్ర బడ్జెట్‌ ప్రతులను దగ్ధం చేశారు. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో నిరసన తెలిపారు.

➡️