Deputy CM: శాఖలో నాకు జీతమేమీ వద్దని చెప్పా : పవన్‌ కళ్యాణ్

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు కృషి చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది లబ్దిదారులకు పెన్షన్లు అందజేసారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గొల్లప్రోలుకు వచ్చారు. ఎన్నికలలో గెలిచిన అనంతరం తొలిసారిగా పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను పెంచి అందిస్తుందన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. మాటలు కాకుండా చేతల ద్వారా పనిచేసే నిరూపిస్తామన్నారు. గోదావరి జిల్లాలో పుష్కలంగా తాగునీటి వనరులు ఉన్నా ప్రజలు నేటికీ తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. జల్ జీవన్ మిషన్ నిధులు కేంద్రం ద్వారా అందుబాటులో ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో డబ్బులు లేకుండా ఖాళీ చేశారన్నారు.ఈ శాఖను గాడిలో పెట్టేందుకు పనిచేస్తామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డీఏలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అద్భుతాలు చేస్తామని చెప్పము, కానీ ప్రజలకు జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్లపై దుష్ప్రచారం చేసిందన్నారు. ఋషికొండలో ప్యాలెస్ కట్టే డబ్బుతో ఒక జిల్లా అభివృద్ధి జరిగేదన్నారు. తాను ఎక్కువ మాటలు చెప్పను పని చేసి చూపిస్తానని చెప్పారు. ”విజయ యాత్రలు చేయను, పిఠాపురం ప్రజలకు కనీస అవసరమైన రక్షిత మంచినీటిని అందించాలని ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఉపాధి అవకాశాలు తీసుకురావాలి. అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు అందించేలా మొదటి ప్రయత్నం చేస్తానన్నారు. వ్యవసాయం, కాలువ పూడికలు వంటి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పంచాయతీరాజ్ శాఖలో అద్భుతమైన అధికారులు ఉన్నారన్నారు. ప్రజల మన్నలను పొందిన తర్వాతే ఆనందంగా ఉంటుందన్నారు. పనిచేసే మీ మన్నలను పొందుతాన”న్నారు.
భారతదేశంలోనే అత్యంత మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నానన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలను తీసుకొస్తానని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు.తెలుగుదేశం లీడ్ పార్ట్నర్ గా జనసేన, బిజెపి కలిసి ఉన్న ఎన్డీఏ ఓటమి ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు అనుభవం వలన ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీనే పెన్షన్లను పెంచి అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నానని డబ్బులతో రాజకీయాలను ముడి పెట్టకుండా ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఏ సమస్య చిటికలో పరిష్కారం కాదు కానీ చిటికలో సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నవారైకైనా ఓటు వేయకపోయినా అర్హత ఉన్నవారికి ఇంటికొచ్చి పెన్షన్ అందజేసి తీరుతామన్నారు.
వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని గత ప్రభుత్వం ప్రచారం చేసింది, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంపిణీ ఎక్కడ ఆగలేదన్నారు. జిల్లాలో 620 సచివాలయాలు ఉండగా వాటిల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తున్నారని, వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎక్కడ ఆగాయని ప్రశ్నించారు. తొలి రోజే పంపిణీ పూర్తి అయ్యేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరైనా పెన్షన్లు కోత విధిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.
గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు, తాము వ్యవస్థలను గాడిలో పెడతామన్నారు. ఇటీవల మంత్రి మనోహర్ తనిఖీల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ అవుతున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలవ చేయడంతో సీజ్ చేశారన్నారు. వ్యవస్థలను చంపేసి వ్యక్తులు గత ప్రభుత్వంలో పెరిగారన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాది అని స్పష్టం చేశారు.
రాబోయే ఐదేళ్లలో పంచాయతీల్లో రక్షిత మంచినీరు లేదు అనే గ్రామం లేకుండా పనిచేస్తామన్నారు. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు అని మాత్రమే నేను కోరుకున్నాను, ఉప ముఖ్య మంత్రి పదవి వస్తుందనుకోలేదన్నారు. సరైన వ్యక్తులకు ఓటు వేశామని ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేస్తామన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పనిచేయాలని ఆశిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని సజావుగా సాగించిన అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో ఇల్లు కోసం సొంత స్థలం వెతుకులాటలో ఉన్నానని, ఇల్లు కట్టుకుని పిఠాపురం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తదితరులు మాట్లాడారు.

➡️