9న జైల్‌ భరో – ఎస్మా పచ్చి నియంతృత్వం

ap govt esma on anganwadi workers

– రాష్ట్ర బంధ్‌కూ సిద్దం

– కార్మిక సంఘాల హెచ్చరిక

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పచ్చి నియంతృత్వమని, వెంటనే ఎత్తేయకపోతే రాష్ట్ర వ్యాప్త బంద్‌ చేపడతామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు జైల్‌ భరో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు పొలారి, టిఎన్‌టియుసి నాయకులు ఆదిబాబు మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 7న ఎస్మా కాపీలను రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయనున్నామని తెలిపారు. అలాగే అన్ని పరిశ్రమలు, సంస్థల వద్దా ఎస్మా జిఓలు దగ్ధం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ‘ఎస్మా’ జిఓను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారని తెలిపారు. 26 రోజులు సమ్మె చేస్తున్నా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. అంగన్‌వాడీలు అత్యవసర సర్వీసులని చెబుతున్న ప్రభుత్వం మరి ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేదని వారు ప్రశ్నించారు. పాలు, నీళ్లు, విద్యుత్‌ వంటివి అత్యవసర సర్వీసుల కింద వస్తాయని, కానీ అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం మూర్ఖత్వమని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, కార్యదర్శి కె ధనలక్ష్మి, ముజఫర్‌ అహ్మద్‌, ఐఎఫ్‌టియు నాయకులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️