అమల్లో ఇంకా పాత జోనల్‌ రూల్సే. 

ap high court on new zones districts

 

  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా గతంలోని పాత జోనల్‌ రూల్సే అమల్లో ఉన్నాయని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో విద్యా, ఉపాధి అవకాశాల్లో ఏ ఒక్కరూ నష్టపోరని ప్రభుత్వం తరఫున ఎజి ఎస్‌ శ్రీరామ్‌ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, అందువల్ల సంబంధిత జిఓలను కొట్టేయాలని కోరుతూ గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన దొంతినేని విజరుకుమార్‌ ఇతరులు దాఖలు చేసిన పిల్స్‌ను బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ కొనసాగిస్తామని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ఆస్పత్రిలో సేవ చేయండి

ఎత్తు విషయంలో పోలీసు నియామక బోర్డుపై తప్పుడు ఆరోపణలు, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన అభ్యర్థులకు నెల రోజుల సామాజిక సేవను శిక్షగా హైకోర్టు విధించింది. నెల రోజులపాటు ప్రభుత్వాస్పత్రిలో సేవ చేయాలని, ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలు కూడా తీసుకుని హైకోర్టుకు అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌, జస్టిస్‌ న్యాపతి విజరుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఎత్తు కొలతపై పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలతో హైకోర్టులో వారికి కొలతలు కొలిపించింది. పిటిషనర్ల వాదన వాస్తవం కాదని తేలింది. దీంతో ఆరుగొళ్లు దుర్గాప్రసాద్‌తోపాటు మరో 23 మందికి సామాజిక శిక్ష విధించింది.

  • పిటిషన్‌ను సవరించండి

తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సిబిఐ ఎస్‌పి రాంసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణ జరిపింది. ఈ మూడు పిటిషన్లకు విచారణార్హత లేదని, కోర్టు ఆదేశిస్తేనే పోలీసులు కేసు నమోదు చేశారని, పులివెందుల పోలీసులు సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ కూడా వేశారని స్పెషల్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సూరా వెంకట సాయినాథ్‌ వాదించారు. కేసు కొట్టేయాలన్న అభ్యర్థనను సవరించి, చార్జిషీట్‌ను కూడా కొట్టేయాలని కోరాలని పిటిషనర్లకు హైకోర్టు సూచన చేసింది. ఇందుకు పిటిషనర్ల న్యాయవాదులు అంగీకరించారు. దీంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ జస్టిస్‌ బి భానుమతి ఉత్తర్వులు జారీ చేశారు.

➡️