మూడు జిల్లాలకు కొత్త ఎస్‌పిలు

May 19,2024 08:29 #2024 election, #police
  •  సస్పెన్షన్‌కు గురైంది ఇసి నియమించిన వారే
  •  నూతన నియామకాల్లో రాజకీయం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల అనంతరం ఘర్షణల నేపథ్యంలో ఎస్‌పిలపై చర్యలు తీసుకున్న మూడు జిల్లాల్లో కొత్త అధికారులను నియమించారు. పల్నాడు జిల్లాకు మల్లిక గార్గ్‌, అనంతపురం జిల్లాకు శాలి గౌతమి, తిరుపతికి వి.హర్షవర్థన్‌రాజును నియమిం చారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపించింది. ఎన్నికల రోజు, అనంతరం తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి నియోజక వర్గాల్లో ఘర్షణలు చోటుచేసు కున్నాయి. వందల సంఖ్యలో పార్టీల నాయకులు గుమిగూడుతున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ప్ర త్యర్థుల ఇళ్లపై కర్రలు, రాడ్లు, పెట్రోలు బాంబులతో స్వైర విహారం చేశారు. అయినా డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు ఎవరూ అక్కడ కనిపించలేదు. దీనివెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఎన్నికల సంఘం కూడా సీరియస్‌ అయ్యింది. వెంటనే డిజిపి, సిఎస్‌ను ఢిల్లీకి పిలిచి వివరణ అడిగింది. మూడు జిల్లాల ఘటలనపై సిఎస్‌, డిజిపి వివరణ ఇచ్చి వచ్చారు. ఇందులో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్‌పిలను సస్పెండ్‌ చేయాలని, తిరుపతి జిల్లా ఎస్‌పిని బదిలీ చేయాలని సిఎస్‌ సూచించారు. సస్పెండ్‌ చేయాలని సూచించిన ఇద్దరు అధికారులు కొత్తగా నియ మితులైన వారే. ఎన్నికల కమిషన్‌ నియమించిన అధికారుల్లో ఇద్దరిని సస్పెండ్‌ చేయడం, ఒకరిని బదిలీ చేయడం వెనుక రాజకీయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పనిసరిగా ఎస్‌పిలను మార్చాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించడం, కొత్త వారిని నియమించడం చకచకా జరిగిపోయాయి. ఇలా నియమించిన వారినే సస్పెండ్‌ చేయడం, అనుకూలమైన అధికారిని కేవలం బదిలీ చేశారనే విమర్శలూ వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్తగా నియమించిన ఒక అధికారి కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై సస్పెండయిన ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్‌కు తమ వివరణ తెలియజేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.

➡️