జగన్‌ హయాంలో ఆక్వా హాలిడే- యువగళం యాత్రలో లోకేష్‌

Nov 29,2023 08:42 #Nara Lokesh, #yuvagalam padayatra

ప్రజాశక్తి – అమలాపురం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆక్వా హాలిడే ప్రకటించే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆక్వా రైతుల పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా తయారైందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు క్యాంప్‌ సైట్‌ నుంచి 211వ రోజు యువగళం పాదయాత్రను మంగళవారం ఆయన కొనసాగించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. యాత్రలో భాగంగా వివిధ సామాజిక తరగతులు, ఆక్వా రైతులు, యువత, స్థానికులతో సమావేశమయ్యారు. ఆయా రంగాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత అమలాపురం పేరూరు క్షత్రియ కల్యాణ మండపం వద్ద ఆక్వా రైతుల సమావేశంలో పాల్గన్నారు. గిట్టుబాటు ధర రావడం లేదని, ఫీడ్‌ యజమానులు సిండికేట్లుగా మారి ధరలు పెంచేస్తున్నారని, రొయ్యల ఎగుమతిదారులు సైతం సిండికేట్లుగా మారి ధరలను నియంత్రిస్తున్నారని ఆక్వా రైతులు వాపోయారు. లోకేష్‌ మాట్లాడుతూ… సీడ్‌, ఫీడ్‌, విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచి ఆక్వా రైతులను వైసిపి ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. టిడిపి అధికారంలోకొస్తే ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ అందిస్తామని తెలిపారు. అనంతరం అమలాపురం క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. నాలుగున్నరేళ్ల జగన్‌ పాలనలో చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. ముమ్మిడివరం గేటు వద్ద లోకేష్‌ను వికలాంగులు కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం శెట్టిబలిజ సంఘం నాయకులతో లోకేష్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వ హయాంలో బిసి కులాలు, కులవృత్తులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. బిసిల కోసం ఖర్చుచేయాల్సిన రూ.75,760 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా పద్ధతిన శెట్టి బలిజలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముమ్మిడివరంలోని మహిళా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్‌ సైట్‌ వద్దకు యాత్ర చేరుకుంది. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, హరీష్‌మాథూర్‌, మెట్ల రమణబాబు తదితరులు ఉన్నారు.

➡️