కాకీ కాఠిన్యం

Jan 23,2024 11:12 #arrested, #Kaki Kathynyam, #Vijayawada
  •  ఏలూరు జిల్లాకు తరలింపు-నీరసించినా వైద్యం అందించడంలో తీవ్ర జాప్యం
  • -విజయవాడలో అరెస్టు…
  • పరిస్థితి విషమించాకా ఆస్పత్రికి తరలింపు

ప్రజాశక్తి- యంత్రాంగం : విజయవాడలో నిరవధిక దీక్షా శిబిరంలో ఉన్న అంగన్‌వాడీలను, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అమానుషంగా అరెస్టు చేసి, బలవంతంగా వ్యానుల్లో ఎక్కించి ఏలూరు జిల్లా పెదవేగిలోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో విజయవాడలో ఆరు రోజులుగా దీక్షలో ఉన్న అంగన్‌వాడీ వర్కర్స్‌్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి కె.వి.రామలక్ష్మి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన అంగన్‌వాడీలు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు టి.ప్రసాద్‌తో పాటు మొత్తం 497 మంది ఉన్నారు. రామలక్ష్మి ఆరోగ్యం బాగోలేదని, అంబులెన్స్‌లో తరలించాలని తోటి అంగన్‌వాడీలు కోరినా పోలీసులు కనికరం చూపలేదు. వ్యాన్‌లో కుక్కి పెదవేగి పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. దీంతో, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. అంగన్‌వాడీలు తీవ్ర ఆందోళన చెంది పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అప్పుడు అంబులెన్స్‌ను రప్పించి దగ్గరలోని గోపన్నపాలెం పిహెచ్‌సికి తరలించారు. సుగర్‌, బిపి ఎక్కువగా ఉండడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రామలక్ష్మికి ఐసియులో చికిత్స చేశారు. సోమవారం సాయంత్రానికి ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో జనరల్‌ వార్డుకు తరలించారు. ఆమె వెంట దేవీపట్నం మండలానికి చెందిన అంగన్‌వాడీలు కె.వెంకటరత్నం, కోసు మంగాయమ్మ ఉన్నారు. రామలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఎప్పటికప్పుడు తెలుసుకుని మెరుగైన వైద్యం అందేలా చూశారు. వామపక్ష నాయకులు, కార్మిక సంఘాల నాయకులు ఆమెను పరామర్శించారు. రామలక్ష్మిని మంగళవారం డిశార్జ్‌ చేయనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళ పట్ల పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టిఫిన్‌గానీ, భోజనంగానీ ఇవ్వకుండా…పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించిన వారికి భోజనంగానీ, టిఫిన్‌గానీ పోలీసులు ఇవ్వలేదు. ఈ విషయం తెలిసి సిపిఎం, సిపిఐ, వామపక్షాల నాయకులు బిస్కెట్‌ ప్యాకెట్లు వంటివి పట్టుకెళ్లినా సెంటర్‌ లోనికి వారిని పోలీసులు అనుమతించలేదు. దీంతో, గేటు పైనుంచి లోపలికి వాటిని విసరాల్సి వచ్చింది.

➡️