బాపట్ల ఎంపి సురేష్‌పై దాడి

May 11,2024 23:20 #attacity case, #mp suresh

– యద్దనపూడి స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు
ప్రజాశక్తి-యద్దనపూడి (బాపట్ల జిల్లా) :బాపట్ల వైసిపి ఎంపి నందిగం సురేష్‌పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. యద్దనపూడి మండలం చింతపల్లిపాడు వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యద్దనపూడి పోలీసుస్టేషన్‌లో 15 మందిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంపి నందిగం సురేష్‌ చీరాలలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గని.. యద్దనపూడి మీదుగా మార్టూరు మండలం వలపర్లకు వెళ్తున్నారు. చింతపల్లిపాడు వద్ద ఆయన వాహనానికి టిడిపికి చెందిన ప్రచార వాహనాలతో కార్యకర్తలు ఎదురుపడ్డారు. ర్యాలీలో ఉన్న టిడిపి కార్యకర్తలు కొందరు ఆయన కారుకు ద్విచక్ర వాహనాలు అడ్డం పెట్టారు. దీనిపై ప్రశ్నించేందుకు కారు దిగిన ఎంపిపై కర్రతో దాడి చేశారు. ఆ గ్రామానికి చెందిన అట్లారి మహేష్‌ ఎంపికి అడ్డుపడగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎంపి సురేష్‌ యద్దనపూడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని, అడ్డుపడిన తన అనుచరులపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపి ఫిర్యాదు మేరకు పోలీసులు టిడిపి కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. వైసిపి కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని కొద్దిసేపు ఆందోళన చేశారు.

➡️