ఈనాడు ఆఫీసుపై దాడి అనాగరికం – నిందితులను కఠినంగా శిక్షించాలి

Feb 21,2024 11:08

ప్రజాశక్తి- కర్నూలు క్రైం/అమరావతి బ్యూరో : కర్నూలు నగరంలోని ఈనాడు పత్రిక ప్రాంతీయ కార్యాలయంపై దాడి అనాగరికమని పలువురు పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

సిపిఎం ఖండన

                ఈనాడు పత్రిక కర్నూలు ప్రాంతీయ కార్యాలయంపై వైసిపి ఎమ్మెల్యే అనుచరుల దాడిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. పత్రికా కార్యాలయాలపైనా, పాత్రికేయులపైనా భౌతిక దాడులకు పూనుకోవడం అనాగరికమని పేర్కొన్నారు. ఆదివారం నాడు రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ను కొట్టడం, మంగళవారం కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం పాలక పార్టీ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. ఈ ధోరణి మార్చుకోకపోతే ప్రజాప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాడికి గురైన ఈనాడు ప్రాంతీయ కార్యాలయాన్ని సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ, నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎండి అనందబాబు పరిశీలించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఈ దాడిని సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి.గౌస్‌ దేశారు ఒక ప్రకటనలో ఖండించారు. ఎమ్మెల్యే కబ్జాలకు పాల్పడకుంటే న్యాయపరంగా కోర్టు ద్వారా ఈనాడు మీద కేసు వేసి నిరూపించుకోవచ్చని, భౌతిక దాడులకు పాల్పడడం అరాచకమని పేర్కొన్నారు.

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు : టిడిపి

                  దాడిని టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బిటి.నాయుడు, సీనియర్‌ నాయకులు రాంపుల్లయ్య యాదవ్‌ వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్యంపై దాడి : షర్మిల

              దాడి అమానుషమని పిసిపి అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ దాడిని, ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని ఆమె ఖండించారు. పత్రికా కార్యాలయాలపైనా, పత్రికా ప్రతినిధులపైనా దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని పేర్కొన్నారు.

వైసిపి దమనకాండను నిరసించాలి : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

                  రాష్ట్రంలో జర్నలిస్టులపై వైసిపి ప్రభుత్వం చేస్తున్న దమనకాండను నిరసించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి అరాచక పాలనకు అడ్డులేకుండా పోతుందనేందుకు కర్నూలులో ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడి మరోసారి రుజువు చేస్తోందన్నారు. తక్షణమే ఈనాడుపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

విధ్వంసాలతో మీడియాను బెదిరించలేరు : ఎపిడబ్ల్యుజెఎఫ్‌

            ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ వెంకట్రావు, జి ఆంజనేయులు, ఎపిబిజెఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు, కోశాధికారి కె మునిరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాడి అనుమానుషమని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.మద్దిలేటి, జిల్లా కన్వీనర్‌ కె.నాగేంద్ర పేర్కొన్నారు. కర్నూలులో దాడికి గురైన ఈనాడు కార్యాలయాన్ని ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు ఐవి.సుబ్బారావు సందర్శించారు. ఈనాడు కార్యాలయం దాడి రాజ్యాంగంపై దాడినే : సాహితీ స్రవంతిఈనాడు కార్యాలయంపై దాడి రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్చపై దాడి అని ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కెంగార మోహన్‌, సత్యరంజన్‌ పేర్కొన్నారు.

➡️