పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కొనుగోలు యత్నాలు

May 6,2024 22:27 #anathapuram, #Postal ballot
  • కళ్యాణదుర్గంలో వివాదం

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ మొదలవ్వడంతో అనంతపురం జిల్లాలో ఓట్ల కొనుగోలు ప్రయత్నాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం ఈ రకంగా ఉద్యోగులకు డబ్బుతో ఎరవేసే ప్రయత్నాలను అధికార వైసిపి చేపట్టింది. దీన్ని గుర్తించిన టిడిపి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టిడిపి నాయకుల వివరాల మేరకు..అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్‌డిఒ కార్యాలయం వద్ద కానిస్టేబుల్‌ శివ అనే వ్యక్తి ఓటింగ్‌కు వస్తున్న ఉద్యోగులకు డబ్బులు ఎరవేసే ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అధికార వైసిపికి అనుకూలంగా ఓటు వేస్తే రెండు వేల రూపాయలు ఇస్తామని ఆశ చూపుతుండగా టిడిపి నాయకులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వైసిపి, టిడిపి నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే విధంగా అనంతపురంలోని జూనియర్‌ కళాశాల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేయడానికి వచ్చిన వారికి కొంత మంది డబ్బులు ఆశ చూపే ప్రయత్నం చేశారు. ఉద్యోగులు దీన్ని తిరస్కరించారు. అనంతపురం జిల్లాలో మొత్తం 26,150 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో ఇప్పటి వరకు 10499 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌కుమార్‌ తెలిపారు. ఇక హోం ఓటింగ్‌కు 1247 మంది దరఖాస్తు చేసుకుని ఇప్పటి వరకు 296 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

➡️