ముగ్గురు మహిళా కార్మికులు దుర్మరణం

Mar 26,2024 22:18 #Auto overturned, #dead, #two laborers

-16 మందికి గాయాలు
ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా జిల్లా), గుంటూరు :వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యవసాయ మహిళా కార్మికులు మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న ఆగిరిపల్లి గ్రామం నుంచి తెంపల్లి గ్రామానికి పత్తి తీసేందుకు 14 మంది మహిళా వ్యవసాయ కార్మికులు ఆటోలో బయలుదేరారు. వీరపనేనిగూడెం సెంటర్‌లో ద్విచక్రవాహనం అడ్డు రావడంతో ఆటో డ్రైవర్‌ స్టీరింగ్‌ వదిలేసి కిందకు దూకేశారు. దీంతో ఆటో అదుపుతప్పి ఫల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న వీర్ల బుజ్జి (50), వీర్ల సుజాత (35)కు తీవ్ర గాయాలయ్యి క్కడికక్కడే మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం అప్పాపురం గ్రామానికి చెందిన 15 మంది మహిళా వ్యవసాయ కార్మికులు పెదనందిపాడు మండలం పాలపర్రులో శనగ పంటను తొలగించి తిరిగి ఆటోలో ఇంటికి వస్తుండగా గ్రామ సమీపంలో శనగపంటను తీసుకువెళ్తున్న ట్రాక్టర్‌ను ఆటో ఢకొీట్టింది. మహిళా కార్మికులు వెంకాయమ్మ (55) మరణించారు. పొందుగల సోఫియా, పేట శరణ్య, మూకి వనజాక్షి, పేట రాధాకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకాయమ్మ కుటుంబాన్ని, క్షతగాత్రులను ఆదుకోవాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్‌ చేశారు.

➡️