పెట్రోల్‌ బంకుల వద్ద ఓటు హక్కుపై అవగాహన : సిఇఒ ఎంకె మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద హోర్డింగుల ఏర్పాటు ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో బుధవారం హెచ్‌పిసిఎల్‌, ఐఒసిఎల్‌, బిపిసిఎల్‌ చమురు పరిశ్రమల ప్రతినిధులతో ఓటర్ల అవగాహన కార్యక్రమాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. క్రమబద్ధమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం కార్యక్రమం అమల్లో భాగంగా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను చమురు పరిశ్రమల ద్వారానూ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పోస్టల్‌శాఖ ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇసిఐ లోగోతో ఎన్నికల తేదీ, ఓటు హక్కు విలువను తెలియజేసే నినాదాలతో హోర్డింగుల డిజైన్లను అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్‌ బంకుల వద్ద హోర్డింగులను ఏర్పాటు చేయాలన్నారు. సిఇఒ ప్రతిపాదనలకు కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో అదనపు సిఇఒ ఎమ్‌ఎన్‌ హరీందర్‌ ప్రసాద్‌, డిప్యూటీ సిఇఒ ఎస్‌ మల్లిబాబు, చమురు పరిశ్రమల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త జె సంజరుకుమార్‌, హెచ్‌పిసిఎల్‌ చీఫ్‌ రీజనల్‌ మేనేజరు ఆదిత్య ఆనంద్‌, ఒసిఎల్‌ ప్రతినిధి ఎ అనిల్‌కుమార్‌, బిపిసిఎల్‌ టెరిటరీ మేనేజరు ప్రసాద్‌ రాజ్వాడే పాల్గొన్నారు.
హోర్డింగుల గుర్తింపు తప్పనిసరి
ఎన్నికల సంబంధిత మెటీరియల్‌పై హోర్డింగులతో సహా ప్రింటర్‌, పబ్లిషర్ల గుర్తింపును ఇసి తప్పనిసరి చేసింది. మున్సిపల్‌ అధికారుల నియంత్రణలో ఉన్న హోర్డింగు స్థలాల్లో గుర్తింపు లేకుండా హోర్డింగులు వెలుస్తున్నాయని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా రాష్ట్రాలకు పంపిన లేఖలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 127ఎ, ప్రింటర్‌, ప్రచురణకర్త, చిరునామాను ప్రదర్శించకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు, బ్యానర్లను ముద్రించడం, ప్రచురించడాన్ని నిషేధించిన సంగతి ఇసి గుర్తుచేసింది.

➡️