‘అనంత’లో బాలోత్సవ సంబరం

Feb 13,2024 08:12 #amaravati balotsav, #anathapuram
  •  ఆకట్టుకున్న ప్రదర్శనలు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : పిల్లల పండుగ అనంత బాలోత్సవం-2024 సంబరం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పివి.నరసింహారావు ప్రాంగణంలో అనంత బాలోత్సం నిర్వహించారు. ఈ వేడుక మూడు రోజుల పాటు జరగనుంది. కల్చరల్‌, అకడమిక్‌ కలిపి 64 ఈవెంట్లలో చిన్నారులు ప్రదర్శన చేశారు. అంతకు మునుపు అనంత బాలోత్సవ కమిటీ చైర్మన్‌ షమీమ్‌ షఫీవుల్లా, ఇతర ప్రముఖులతో కలిసి జాతీయ జెండాను ఎగుర వేశారు. ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ… పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి అనంత బాలోత్సవం చక్కటి వేదికగా నిలిచిందన్నారు. ప్రొఫెసర్‌ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారని, శాస్త్రీయమైన శాస్త్రవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారని, నేటి బాలలందరూ శాస్త్రీయమైన భావాలను అలవర్చుకుని శాస్త్రీయమైన భారతదేశాన్ని స్థాపించుకోవడంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. మొదటి రోజు పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, అనంత బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి వి.సావిత్రి, కోశాధికారి జిలాన్‌, లలితా కళాపరిషత్‌ అధ్యక్షులు ప్రభాకర్‌, కార్యదర్శి పద్మజ, జెవివి నాయకులు డాక్టర్‌ ప్రసూన, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, పెన్షనర్‌ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప, రవికాంత్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️