సివిల్‌ సర్వీస్‌ అధికారులపై నిరాధార ఆరోపణలు తగవు: మంత్రి బొత్స

Apr 9,2024 00:55 #coments, #Minister Botsa

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నిజాయితీగా పనిచేస్తున్న సివిల్‌ సర్వీస్‌ అధికారులపై ప్రశాంత్‌ కిషోర్‌ బృందం నిరాధార ఆరోపణలు చేయడం గర్హనీయమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన విశాఖలోని వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సివిల్‌ సర్వీస్‌ అధికారులు చాలాకాలం నుంచి పలువురు ముఖ్యమంత్రుల ప్రభుత్వాల్లో కీలకంగా పనిచేస్తున్నారని, వారిలో ఇద్దరో, ముగ్గురో కొన్ని పొరపాట్లు చేసినంత మాత్రాన అందరిపైనా అభాండాలు వేయడం సరికాదని అన్నారు. వారందరినీ ఎన్నికల విధుల నుంచి తొలగించి మార్గదర్శి, హెరిటేజ్‌ తదితర సంస్థల అధికారులను నియమించి ఎన్నికలు జరుపుకోవొచ్చా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. దీన్ని సహించలేని ప్రతిపక్షాలు నిరాధారమైన అరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. భౌతికశాస్త్ర పితామహుడు సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ చెప్పిన విధంగా చర్యకు ప్రతిచర్య ఉన్నట్లు వారి చర్యకు తమ నుంచి కూడా ప్రతిచర్య ఉంటుందని పేర్కొన్నారు. బీహార్‌లో ప్రజా తిరస్కారానికి గురైన ప్రశాంత్‌ కిషోర్‌ను ఎపి ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. చంద్రబాబు మేనేజ్‌ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వలంటీర్లపై ఇసికి లేఖ రాసిన వారు గోతిలో పడ్డారన్నారు. తాము అప్పులు చేస్తున్నామని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, అప్పులు తేకుండా రూ.4 వేల పింఛను ఇస్తామని చంద్రబాబు ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. పవన్‌ నిలకడలేని మనిషని విమర్శించారు. మీడియా సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షులు కోలా గురువులు పాల్గొన్నారు.

➡️