రూ.29,048 కోట్లు కావాలి 

Jan 7,2024 09:49 #BC Welfare
bc welfare funds
  • బిసి సంక్షేమానికి అధికారుల ప్రతిపాదన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న ఆర్థిక సంవత్సరంలో బిసిలకు ప్రస్తుతమున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు కొనసాగేందుకు 29,048 కోట్ల రూపాయలు కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో కొత్త పథకాలను ప్రకటిస్తే వాటి అమలుకు అదనపు నిధులు కేటాయించాల్సి వస్తుందని పేర్కొన్నారు. నూతన ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ కసరత్తులో భాగంగా ఈ ప్రతిపాదనలు చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓట్‌ ఆన్‌అక్కౌంట్‌కు అనుమతి కొరనున్నప్పటికీ ఏడాది మొత్తాన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసే సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 29,048 కోట్లు కావాలని ప్రతిపాదించిన వెనుకబడిన తరగతుల శాఖ దానిలో పింఛన్లకు 10,817 కోట్లు అవసమవుతాయని ప్రతిపాదించారు. ఇక వెనుకబడిన సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన బిసి కమిషన్‌, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత పథకాలకు కూడా భారీగానే నిధులు కోరుతున్నారు. అమ్మఒడికి 3,514 కోట్లు, చేయూత పథకానికి 3,547 కోట్లు, ఆసరా కోసం 3,347 కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అయితే ఇంత భారీగా ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నప్పటికీ ఆర్థికశాఖ ఎంత వరకు కేటాయింపులు చేస్తుందో చూడాల్సి ఉరది. గతేడాది కూడా భారీగానే ప్రతిపాదనలు సమర్పించగా, అందులో ఆర్థికశాఖ కోతలు విధిరచడం తెలిసిందే.

➡️