గిరిజనంపై బిజెపి దాడి

  • ప్రజా వ్యతిరేక చట్టాలపై నోరు మెదపని వైసిపి, టిడిపి
  • ఇండియా వేదిక గెలుపుతోనే ప్రజలకు రక్షణ
  • ఎన్నికల ప్రచార సభల్లో బృందా కరత్‌

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : గడిచిన పదేళ్లలో గిరిజన జీవన విధానాలపై బిజెపి దాడి చేయడంతోపాటు గిరిజన, అటవీ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెట్టిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు చేసినప్పటికీ రాష్ట్రంలోని వైసిపి, టిడిపి ఎంపిలు నోరు మెదపలేదని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా వేదిక గెలుపుతోనే ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు. సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులకు మద్దతుగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలకీëపురంలో జరిగిన సభలోనూ, పార్వతీపురంలో రోడ్‌ షోనూ సోమవారం ఆమె పాల్గొని ప్రసంగించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశానికి గుండెకాయలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నించిందన్నారు. గిరిజనులకు, రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల పోలింగ్‌లో బిజెపి ఓటమి కనిపిస్తోందని, దీంతో, ఆ పార్టీ భయపడుతోందని తెలిపారు. బిజెపి టైర్లు పంచర్‌ అవుతున్నాయని, వాటిని సరి చేయాలంటే గాలికొట్టిపైకి లేపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకు చంద్రబాబు స్టెఫినీలా ఉపయోగ ఉపయోగపడుతున్నారని విమర్శించారు. బిజెపి పాలనలో గిరిజనులు, ముస్లిములపై దాడులు పెరిగాయని, మణిపూర్‌లో బిజెపి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉండడంతో గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి మతోన్మాదం రేపిందని అన్నారు. ఆ పార్టీని ఒంటరి చేసేందుకు దేశంలో అనేక పార్టీలు ఇండియా వేదికగా ఏర్పడ్డాయని తెలిపారు. బిజెపికి టిడిపి వంతపాడుతూ పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, పార్వతీపురం మాజీ ఎంపి కిశోర్‌ చంద్రదేవ్‌ టిడిపి నుంచి బయటకు వచ్చారని, ఇండియా వేదిక తరఫున సిపిఎం నుంచి పోటీ చేస్తున్న అరకు ఎంపి, కురుపాం అసెంబ్లీ అభ్యర్థులను బలపరిచారని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన యుపిఎ -1 ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తెచ్చిందన్నారు. ఆ చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడికీ గరిష్టంగా పది ఎకరాల వరకు సాగు పట్టాలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ, రెండున్నర ఎకరాలకు మించి ఇవ్వలేదని తెలిపారు. దేశ వ్యాప్తంగా సాగు పట్టాల కోసం సుమారు 50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 20 లక్షల మందికి మాత్రమే పట్టాలు ఇచ్చారని వివరించారు. ఈ భూములపై గిరిజనులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారన్నారు. అటవీ సంరక్షణ చట్టం పేరుతో గ్రామసభలు పెట్టి గిరిజనుల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా గిరిజన చట్టాన్ని సవరించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే గిరిజన ప్రాంతంలోని గనుల దోపిడీ మరింతగా పెరుగుతుందన్నారు. ఇన్ని జరుగుతున్నా వైసిపి ఎంపిలు పార్లమెంట్‌లో నోరు విప్పడం లేదని తెలిపారు. సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, కురుపాం ఎంఎల్‌ఎ అభ్యర్థి మండంగి రమణలను గెలిపిస్తే గిరిజనుల తరఫున పార్లమెంట్‌, అసెంబ్లీలో పోరాడుతారన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు వీరిద్దరు చాలాకాలంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. దీనికి ముందు ఎల్విన్‌పేట వద్ద బృందా కరత్‌కు సిపిఎం కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి భద్రగిరి మీదుగా జిఎల్‌ పురం వరకూ ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.గంగునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, రాష్ట్ర నాయకులు సిహెచ్‌ నరసింగరావు, సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి, సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణ, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలక అవినాష్‌, విజయనగరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు పాల్గొన్నారు.

➡️