కాంగ్రెస్‌ వైఖరితోనే 3 రాష్ట్రాల్లో బిజెపి : నారాయణ

Dec 4,2023 07:58 #cpi narayana

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలను కలుపుకొనిపోవడంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో విఫలం అయినందునే బిజెపి గెలిచిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఆదివారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తమపార్టీ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేసిందన్నారు. కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలుపొందారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ మిత్రులను సమీకరించడంతోపాటు యువతకు ప్రాముఖ్యత ఇచ్చిందని తెలిపారు. కెసిఆర్‌ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని విమర్శించారు. రాజకీయాల్లో ప్రజలు అహంభావాన్ని సహించరని అందుకే కెసిఆర్‌ను ఓడించారన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ఒక్కడైనా అసెంబ్లీలో తన గళాన్ని ప్రజల పక్షాన గట్టిగా వినిపిస్తారని తెలిపారు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఇండియా వేదికలో వున్న పార్టీలను కలుపుకుపోలేదన్నారు. అందుకే అక్కడ బిజెపి గెలవగలిగిందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ఇండియా వేదిక బలపడాలంటే అందర్నీ కలుపుకుపోవాలన్నారు. తెలంగాణలో కెసిఆర్‌ను గెలిపించడానికి జగన్‌మోహన్‌రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారని విమర్శించారు. అర్ధరాత్రి పోలీసులను నాగార్జున సాగర్‌ వద్దకు పంపి, సెంటిమెంట్‌ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయినా తెలంగాణ ప్రజలు కెసిఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డిలకు శృంగభంగం చేశారని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తీర్పు రేపు ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం అవుతుందని భావిస్తున్నామని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా కెసిఆర్‌ తరహాలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు, ప్రజాసంఘాలకు ఏమాత్రం విలువ ఇవ్వరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో జగన్‌ మోహన్‌రెడ్డిని గద్దె దింపడమే సిపిఐ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.

➡️